హార్ధిక్ పాండ్యాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా

  • ముంబైకి వెళ్లొద్దని ఒప్పించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న మాజీ క్రికెటర్
  • గతంలో ఆడిన జట్టుకే వెళ్లడంతో అడగలేదన్న ఆశిష్ నెహ్రా
  • శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా ఎదగడానికి సహకరిస్తామని వెల్లడి
హార్ధిక్ పాండ్యాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా
ఐపీఎల్‌లో గత రెండు సీజన్‌లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ప్రత్యేక విధానంలో పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హార్ధిక్ పాండ్యా ముంబై జట్టుకి తరలి వెళ్లడంపై గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

గుజరాత్‌ జట్టుకే ఆడాలంటూ హార్దిక్ పాండ్యాను ఎప్పుడూ ఒప్పించే ప్రయత్నం చేయలేదని తెలిపాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్ అనుభవాన్ని జట్టు కోల్పోనుందని భావించానని వెల్లడించాడు. పాండ్యా మరేదైనా ఫ్రాంఛైజీకి వెళ్లి ఉంటే అతడిని ఆపగలిగేవాడిని, కానీ ఇంతకుముందు 5-6 ఏళ్లపాటు ఆడిన జట్టుకు వెళ్లాడని పేర్కొన్నాడు. ఆటగాళ్లు ఎంత ఆడితే అంత అనుభవం వస్తుందని, పాండ్యా అనుభవం ఉన్న ఆటగాడని అన్నాడు.

ఏ ఆటలోనైనా ముందుకు సాగాల్సిందేనని, అనుభవాన్ని కొనుగోలు చేయలేమని వ్యాఖ్యానించాడు. హార్దిక్ పాండ్యా, గాయం కారణంగా దూరమైన పేసర్ మహ్మద్ షమీ వంటి ఆటగాళ్ల లోటుని భర్తీ చేయడం అంతసులువు కాదని పేర్కొన్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు కొత్త పాఠాలు నేర్చుకునే సమయం ఆసన్నమైందని, జట్టు ముందుకు సాగుతుందని నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాండ్యాను ఆపడానికి ప్రయత్నించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. మరోవైపు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా ఎదగడానికి తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌కి గత రెండు సీజన్లలో పాండ్యా సారధ్యం వహించాడు. గతేడాది రన్నరప్‌గా నిలవగా.. అంతక్రితం ఏడాది ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.


More Telugu News