ఆప్ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారంటూ ఈడీ పత్రికా ప్రకటన.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ

  • తీవ్రంగా ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • గతంలోనూ ఇలాంటి ప్రకటనలే ఇచ్చారని మండిపాటు
  • ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా బీజేపీ పొలిటికల్ వింగ్‌లా పనిచేస్తోందని ఆరోపణ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు రూ. 100 కోట్లు చెల్లించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భాగస్వామి అయ్యారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠను నీరుగార్చేందుకే ఈడీ ఇలాంటి ఆరోపణలతో పత్రికా ప్రకటనలు ఇస్తోందని దుయ్యబట్టారు. ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా బీజేపీ పొలిటికల్ వింగ్‌లా పనిచేస్తోందని ఆరోపించారు. 

ఈడీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. 2021-22 ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరికొందరితో కలిసి అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లాంటి అగ్రనేతలతో కలిసి కుట్ర పన్నారు. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారు. ఈ కేసులో ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్‌సింగ్‌లను అరెస్ట్ చేశాం..  అని ఈడీ ఆ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఈడీ ఇచ్చిన ఈ పత్రికా ప్రకటన ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అవాస్తవ ప్రకటను విడుదల చేయడం ఈడీకి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ప్రకటనలే ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ కేసులో 500కుపైగా సోదాలు జరిపినా, వేలాదిమంది సాక్షులను విచారించినా ఒక్క రూపాయి కూడా అక్రమంగా ఉన్నట్టు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. చిన్న సాక్ష్యం కూడా లభించకపోవడంతో విసుగెత్తి ఇలాంటి అవాస్తవ అరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలోనూ ఒక్క కొత్త విషయం కూడా లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని ఆప్ నేతలు ధ్వజమెత్తారు.


More Telugu News