2022 అక్టోబర్ 31న ఆ ట్వీట్ ఎందుకు చేశారో విజయసాయిరెడ్డి చెప్పాలి: రఘురామకృష్ణరాజు

  • విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయన్న రఘురాజు
  • 2022లో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి విజయసాయి శుభాకాంక్షలు తెలిపారని వెల్లడి
  • జగన్, విజయసాయిలకు బ్రెజిల్ లో వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయని ఆరోపణ
  • టన్నుల్లో డ్రగ్ దిగుమతి చేసుకున్న వీరిని ఏం చేయాలని ప్రశ్న
  • జగన్ మళ్లీ కోలుకోని విధంగా కూటమిని గెలిపించుకుందామని పిలుపు
విశాఖ పోర్టులో 25 వేల కిలోల మత్తు పదార్థాలు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చినట్టు తేలిందని ఆయన చెప్పారు. 2022 అక్టోబర్ 31న బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని అభినందిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని... సీఎం జగన్, విజయసాయిరెడ్డిలకు బ్రెజిల్ లో వ్యాపార కార్యకలాపాలు లేకపోతే శుభాకాంక్షలు ఎందుకు తెలుపుతారని ప్రశ్నించారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో ఇక్కడి నాయకుల్లో ఒక్క శాతం మంది చెప్పినా తాను ముక్కున వేలు వేసుకుంటానని... అలాంటిది బ్రెజిల్ అధ్యక్షుడి గురించి విజయసాయి ఎందుకు ట్వీట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

బ్రెజిల్ లో కార్యకలాపాలు నడుపుతున్నారు కాబట్టే... బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో విజయసాయికి తెలుసని రఘురాజు అన్నారు. డ్రగ్స్ కంటెయినర్ దొరుకుతుందని అప్పుడు వారు అంచనా వేసి ఉండరని... అందుకే తొందరపాటులో ట్వీట్ చేసి తప్పులో కాలు వేశారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ ప్రభుత్వ పెద్దలతోనే సాధ్యమవుతుందని చెప్పారు. మలేషియా, సింగపూర్ దేశాల్లో ఒక్క గ్రాము మాదకద్రవ్యం దొరికినా ఉరిశిక్ష విధిస్తారని... అలాంటిది టన్నుల్లో డ్రగ్స్ దిగుమతి చేసుకున్న వీరిని ఏం చేయాలని ప్రశ్నించారు. 

డ్రగ్స్ దిగుమతి అయిన కంపెనీ పురందేశ్వరి బంధువులదని సాక్షిలో రాయడం దారుణమని చెప్పారు. అప్పట్లో నారాసుర రక్తచరిత్ర అని రాసినట్టుగానే ఇప్పుడు పురందేశ్వరిని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనలకు కేటాయించిన పార్లమెంటు స్థానాల్లో నరసాపురం లేదని... ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు దీంతో అర్థమవుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా నరసాపురం నుంచి తాను కూటమి తరపునే పోటీ చేస్తానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన తనను ఏదోలా ఇబ్బంది పెట్టాలని జగన్ కనుసన్నల్లో పని చేసే నాయకులు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ మళ్లీ కోలుకోని విధంగా కూటమిని గెలిపించుకుందామని చెప్పారు.


More Telugu News