హోలీ సంబ‌రాల్లో రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌!

  • జ‌ట్టు సభ్యుల‌తో క‌లిసి హోలీ ఆడిన మాజీ సార‌ధి
  • వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ముంబై ఫ్రాంచైజీ
  • ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ఓట‌మితో ప్రారంభించిన ముంబై ఇండియ‌న్స్‌
  • వ‌రుసగా 12వ సారి తాము ఆడిన తొలి మ్యాచులోనే ఓడి.. చెత్త రికార్డును న‌మోదు చేసిన ముంబై
ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ముంబై ఇండియ‌న్స్ ఓట‌మితో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచులో ముంబై ఆరు ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పొందింది. ఇక‌ సోమ‌వారం ఆ జ‌ట్టు స‌భ్యులు హోలీ సంబ‌రాల్లో మునిగిపోయారు. మాజీ సార‌ధి రోహిత్ శ‌ర్మ తోటి ఆట‌గాళ్ల‌తో హోలీ ఆడిన వీడియోను ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'అంద‌రికీ హోలీ శుభాకాంక్ష‌లు' అనే క్యాప్ష‌న్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

యువ ఆట‌గాడు శుభ్‌మాన్ గిల్‌ గుజ‌రాత్ కెప్టెన్‌గా తొలి మ్యాచులోనే థ్రిల్లింగ్ విక్ట‌రీ అందించాడు. అంత‌కుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబైకి జ‌స్ప్రీత్ బుమ్రా కీల‌క‌మైన మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. గ‌తేడాది గాయం కార‌ణంగా ఐపీఎల్‌కు దూర‌మైన బుమ్రా ఈసారి పున‌రాగ‌మ‌నాన్ని ఘ‌నంగా చాటాడు. 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అలాగే కొట్జీ 2, పియూష్ చావ్లా ఒక‌ వికెట్‌ ప‌డ‌గొట్టారు.   

దాంతో గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 168 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుద‌ర్శ‌న్ (45), కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (31), తేవాటియా (22) ప‌రుగుల‌తో రాణించారు. అనంత‌రం 169 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ముంబై 162 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో మాజీ సార‌ధి రోహిత్ శ‌ర్మ (43), బ్రెవిస్ (46), తిలక్ వర్మ (25), నమన్ ధీర్ (20) రాణించారు. ఇషాన్ కిష‌న్ (0), హార్దిక్ పాండ్యా (11), టిమ్ డేవిడ్(11) నిరాశప‌రిచారు. 

చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో ముంబైకి 43 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఈ స‌మ‌యంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్  వెంట‌వెంట‌నే పెవిలియ‌న్ చేర‌డంతో ముంబైకి ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో స్పెన్స‌ర్ జాన్స‌న్‌, ఉమేష్ యాద‌వ్‌, మోహిత్ శ‌ర్మ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టి.. ముంబైని దెబ్బ‌తీశారు. దీంతో గుజ‌రాత్ ఆరు ప‌రుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కాగా, ముంబై ఇండియ‌న్స్ ఇలా తాము ఆడిన తొలి మ్యాచులో ఓడిపోవ‌డం ఇది వ‌రుసగా 12వ సారి కావ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News