జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ అరెస్ట్

  • నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్
  • సాగునీటి విడుదలపై జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అఖిలప్రియ
  • అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ అరెస్ట్
టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయి.

దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు.


More Telugu News