తొమ్మిది టీవీ, సోషల్ మీడియా ఛానల్స్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

  • కుట్రలో భాగంగా, అజెండాలో భాగంగా తమపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • దీనిని చట్టబద్దంగా ఎదుర్కొంటామన్న కేటీఆర్
  • సంబంధం లేని అంశాల్లో మా పేరును, ఫొటోలను వాడుతున్నారన్న కేటీఆర్
  • ఆ వీడియోలు ఇప్పటికైనా తీసేయాలని డిమాండ్
తమపై ఉద్దేశ్యపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానల్స్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఆయన గతంలోనూ పలు ఛానెల్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు. కుట్రలో భాగంగా, అజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. సంబంధం లేని అంశాల్లో తమ పేరు, ఫొటోలను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్స్‌పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువునష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తొమ్మిది మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా కేటీఆర్‌ నోటీసులు పంపించారు.

కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనను, తన కుటుంబాన్ని బద్నాం చేసేందుకు అసత్య ప్రచారాలను, కట్టుకథలను అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతో ఛానెల్స్‌, మీడియా సంస్థలు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. పక్కా అజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. అసలు తమకు సంబంధం లేని పలు అంశాల్లో తమ పేరును, ఫొటోలను వాడుతూ హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వీరంతా చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా మాకు సంబంధంలేని అంశాలను అంటగడుతూ చేసిన వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని వెంటనే తొలగించుకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు ప్రణాళికతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు.


More Telugu News