ఒక్క నెలలో 76 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

  • ఫిబ్రవరిలో 76,28,000 ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్
  • ఫిర్యాదుకు ముందే 14.24 లక్షల ఖాతాలపై వేటు
  • జనవరిలో 67.28 ఖాతాలను నిషేధించిన మెసేజింగ్ యాప్
మెసేజింగ్ యాప్ వాట్సాప్ లక్షలాదిమంది భారతీయుల ఖాతాలపై వేటేసింది. ఐటీ నిబంధనలు 2021ని అనుసరించి యూజర్ సేఫ్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య ఏకంగా 76,28,000 ఖాతాలను బ్యాన్ చేసినట్టు వివరించింది. వీటిలో 14.24 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదుకు ముందే బ్యాన్ చేసినట్టు తెలిపింది. 

దేశంలో 50 కోట్లమంది వాట్సాప్ వినియోగదారులుండగా ఖాతాల దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 16,618 ఫిర్యాదులు అందినట్టు వాట్సాప్ తెలిపింది. అయితే, వీటిలో 22 ఫిర్యాదులపైనే చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. అంతకుముందు జనవరి నెలలోనూ వాట్సాప్ 67.28 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.58 లక్షల ఖాతాలను యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే నిషేధించింది.


More Telugu News