హెల్త్‌టెక్ స్టార్ట‌ప్‌లో క్రికెట‌ర్‌ శ్రేయ‌స్ అయ్య‌ర్ భారీ పెట్టుబ‌డులు!

  • 'క్యూరెలో' స్టార్ట‌ప్‌లో రూ. 10 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన భార‌త క్రికెట‌ర్‌
  • అయ్యర్‌తో పాటు ఐఐఎంఏ వెంచర్స్, తరుణ్ కటియాల్ (జీ 5 వ్యవస్థాపకుడు), యూఎస్ పరిశ్రమ నిపుణుల నుండి కంపెనీకి పెట్టుబ‌డులు
  • ఇంటివ‌ద్దే రోగుల‌ రక్త నమూనా సేకరణ, సకాలంలో నివేదికలను అందిస్తున్న‌ 'క్యూరెలో' 
  • భారతీయ హెల్త్‌కేర్‌ మార్కెట్‌లో త‌మ సంస్థ‌ వృద్ధి పథంలో కొన‌సాగ‌డానికి ఈ నిధులు వేదికగా నిలుస్తాయ‌ని 'క్యూరెలో' హ‌ర్షం  
ఇంటివ‌ద్ద హెల్త్‌కేర్ స‌ర్వీసులు అందించే స్వదేశీ హెల్త్‌టెక్ స్టార్టప్ 'క్యూరెలో' భార‌త క్రికెట‌ర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌క‌తా నెట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) కెప్టెన్‌ శ్రేయ‌స్ అయ్య‌ర్ రూ. 10 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు సంస్థ గురువారం వెల్ల‌డించింది. అయ్యర్‌తో పాటు ఐఐఎంఏ వెంచర్స్, తరుణ్ కటియాల్ (జీ 5 వ్యవస్థాపకుడు), అమెరికాలోని కుటుంబ కార్యాలయాల నుండి కూడా భారీ మొత్తంలో క్యూరెలో పెట్టుబడులు పొందింది. ఇక 2022లో స్థాపించబడిన క్యూరెలో రోగులను డయాగ్నస్టిక్ ల్యాబ్‌లతో అనుసంధానం చేస్తుంది. ఇంటివ‌ద్దే రోగుల‌ రక్త నమూనా సేకరణ, సకాలంలో నివేదికలను అందిస్తోంది.

ఐఐఎంఏ వెంచర్స్, శ్రేయ‌స్‌ అయ్యర్, పరిశ్రమ నిపుణుల నుండి తాజాగా వ‌చ్చిన‌ భారీ పెట్టుబడులు క్యూరెలోకి ఒక మైలురాయిని సూచిస్తాయని క్యూరెలో హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఇది పోటీతత్వంతో కూడిన భారతీయ హెల్త్‌కేర్‌ మార్కెట్‌లో త‌మ సంస్థ‌ వృద్ధి పథంలో కొన‌సాగ‌డానికి వేదికగా నిలుస్తుందని హెల్త్‌టెక్ స్టార్టప్ పేర్కొంది. 

ఈ సంద‌ర్భంగా క్యూరెలో వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ అర్పిత్ జైస్వాల్ మాట్లాడుతూ.. "క్యూరెలో పెట్టుబడిదారుగా శ్రేయాస్ అయ్యర్‌ను స్వాగతిస్తున్నాం. ఈ సహకారం మమ్మల్ని వేగవంతమైన వృద్ధితో పాటు వినియోగ‌దారుల‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా నిలబెడుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మా వినియోగదారుల అవసరాలను తీర్చ‌డంలో మా నిబద్ధతను మ‌రింత‌ బలపరుస్తుంది" అని ఆయ‌న‌ తెలిపారు.

"ప్రతి ఒక్కరి దినచర్యలో ఆరోగ్యం, ఫిట్‌నెస్ కీలక పాత్ర పోషిస్తాయనేది ఎవ‌రూ కాద‌న‌లేని వాస్త‌వం. ఇలా కీల‌క‌మైన హెల్త్‌కేర్ స‌ర్వీసుల‌ను అందించడంలో సమర్థవంతంగా, నిబద్ధతతో క్యూరెలో ప‌నిచేస్తుంది. ఈ కంపెనీ డయాగ్నోస్టిక్స్,హెల్త్‌కేర్‌కి వినూత్నమైన, క‌స్ట‌మ‌ర్ ఫ్రెండ్లీ విధానాన్ని కలిగి ఉంది" అని అయ్యర్ చెప్పాడు. కాగా, ఈ నిధులు 'క్యూరెలో' త‌మ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత‌ విస్తరించడంలో కీలకం కానున్నాయి.


More Telugu News