మేం అధికారంలోకి వస్తే ఉపాధి కూలీ రూ.700 చేస్తాం.. సీపీఐ మేనిఫెస్టో విడుదల

  • రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేస్తామని హామీ
  • గవర్నర్ వ్యవస్థ రద్దుకు పోరాడతాం
  • పార్లమెంట్ పరిధిలోకి కేంద్ర దర్యాఫ్తు సంస్థలు
పెరిగిన నిత్యావసర ఖర్చులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ఉపాధి హామీ కూలీని పెంచుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) హామీ ఇచ్చింది. అంతేకాదు, క్యాలెండర్ ఇయర్‌లో వర్కింగ్ డేస్ 200 వరకూ పెంచుతామని పేర్కొంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో పలు హామీలను గుప్పించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించడంతో అందరికీ సమ న్యాయం దక్కేందుకు, సెక్యులరిజం, ఫెడరలిజం సిద్ధాంతాలను ప్రమోట్ చేసేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈడీ, సీబీఐ తదితర కేంద్ర దర్యాఫ్తు సంస్థలను దుర్వినియోగం చేయకుండా వాటిని పార్లమెంటు పరిధిలోకి తెస్తామని చెప్పారు. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని కూడా ఎత్తేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో కేంద్ర జోక్యాన్ని అడ్డుకుని సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని మరింత ఉధృతంగా పోరాడతామని రాజా చెప్పారు. నూతన పౌరసత్వ బిల్లుతో పాటు ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన అగ్నివీర్ వ్యవస్థను రద్దు చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధిస్తామని మేనిఫెస్టోలో సీపీఐ హామీ ఇచ్చింది.


More Telugu News