బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే

  • పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు లేఖ
  • మల్కాజ్ గిరిలో అవకాశవాది లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేయలేనని వెల్లడి
  • ఉద్యమ సహచరుడు ఈటల గెలుపుకోసం పనిచేస్తానని వివరణ
లోక్ సభ ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎంపీ టికెట్ల కేటాయింపులపై అసంతృప్తితో బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయింపులో ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. లక్ష్మారెడ్డి అవకాశవాది అని, ఆయనను గెలిపించాలంటూ ప్రజల ముందుకు వెళ్లలేనని బీఆర్ఎస్ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు.

బీజేపీ మాత్రం ఉద్యమకారుడు ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకే, అవకాశవాది కోసం కాకుండా ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ ను గెలిపించేందుకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈమేరకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గురువారం లేఖ రాశారు. ఈ లేఖను బేతి సుభాష్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.



More Telugu News