ఆవు పాలలో బర్డ్ ఫ్లూ.. మనుషులకూ వ్యాపిస్తుందా?

  • ఆవు పాల సరఫరాలో గుర్తించిన యూఎస్ఎఫ్‌డీఏ
  • మనుషులకు వ్యాపించే అవకాశం లేదంటున్న అధికారులు
  • శాంపుల్స్‌ను పరీక్షించామని వెల్లడి
అమెరికాలో అనూహ్య రీతిలో పాశ్చరైజేషన్ చేసిన ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ జాడలను గుర్తించారు. ఒక అధ్యయనంలో భాగంగా ఆవు పాల సరఫరాలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించామని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ విభాగం యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు తెలిపారు. దీంతో పాల ద్వారా బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాపిస్తుందా? అనే సందేహాలు  వ్యక్తమవుతున్నాయి. అయితే కలుషిత ఆహారం ద్వారా బర్డ్ ఫ్లూ మానవులకు వ్యాపించే ముప్పు చాలా తక్కువని, శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ విషయం స్పష్టమైందని అధికారులు తెలిపారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో జనించే వేడి ద్వారా వైరస్ అచేతనంగా మారిపోతుందని అధికారులు వివరించారు.

కాగా హెచ్5ఎన్1 వేరియెంట్ అయిన ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌పీఏఐ) వ్యాధికారక వైరస్ అమెరికా అంతటా పాడి పశువులకు వ్యాపించింది. ఒక వ్యక్తికి కూడా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే అతడిలో లక్షణాల ప్రభావం చాలా స్వల్పంగా ఉందని అధికారులు వివరించారు. ఇది సోకిన పశువులు కూడా అంతగా ప్రభావితం కాలేదన్నారు. అయితే హెచ్‌పీఏ వైరస్ ప్రభావంతో అమెరికాలో పౌల్ట్రీ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. పౌల్ట్రీలోని మిలియన్ల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని అధికారులు వివరించారు.


More Telugu News