ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా మంచి సంబంధాలే ఉంటాయి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

  • ఎవరు అధికారంలోకి వచ్చినా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని వెల్లడి
  • ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వలేమన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్‌నే ఇప్పుడు ఎవరూ పట్టించుకోరు.. ఇక మల్లారెడ్డిని పట్టించుకుంటారా? అని ప్రశ్న
  • మెదడు తక్కువ ఉన్నవాళ్లే కేంద్రపాలిత ప్రాంతమని మాట్లాడుతారని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో సత్సంబంధాలే ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా  మాట్లాడుతూ... ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

మల్లారెడ్డి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... కేసీఆర్‌కే దిక్కులేదు ఇక మల్లారెడ్డిని ఎవరు పట్టించుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పదేళ్లలో వందేళ్ల విజన్ అందిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. సగం మంది కాంగ్రెస్‌లోకి, సగం మంది బీజేపీలోకి వెళతారన్నారు. 

కేటీఆర్ యూటీ వ్యాఖ్యపై స్పందించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. యూటీ గురించి మాట్లాడే వారికి మెదడు తక్కువగా ఉన్నట్లేనని విమర్శించారు. యూటీ ఎప్పుడు చేస్తారు... ఎవరు చేస్తారు? కేంద్రపాలిత ప్రాంతమనే అంశమే లేదన్నారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌ను సెకండ్ క్యాపిటల్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు.


More Telugu News