ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇకలేరు.. ధ్రువీకరించిన అధికారిక మీడియా

  • హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్
  • ముక్కలైన హెలికాప్టర్ ఫొటోలు మీడియాకు విడుదల
  • ఒక్కరూ ప్రాణాలతో లేరని వెల్లడించిన అధికారులు
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలయ్యారని ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ప్రమాద స్థలంలో ముక్కలైన హెలికాప్టర్ ను, అక్కడి పరిస్థితికి సంబంధించిన తాజా ఫొటోలు వీడియోలను రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి ఒక్కరూ ప్రాణాలతో బయటపడిన దాఖల్లాలేవని వివరించింది. అతికష్టమ్మీద సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. అక్కడి పరిస్థితిని సుప్రీం లీడర్ అయతొల్లా అలి ఖమేనీకి చేరవేశాయి. ఈ ప్రమాదంలో ప్రెసిడెంట్ రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్దొల్లాహియన్ సహా మొత్తం తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని రెస్క్యూ టీమ్ పేర్కొంది.

ఆదివారం సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. అజర్ బైజాన్ బార్డర్ లో ఓ డ్యామ్ ను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, పొగమంచు కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలకు వర్షం అడ్డంకిగా మారింది. ఓవైపు వర్షం కురుస్తుండడంతో దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. మానవరహిత విమానాల సాయంతో గాలింపు చేపట్టిన అధికారులు.. ప్రమాదస్థలిని గుర్తించి రెస్క్యూ బృందాలను అటువైపుగా పంపించారు. సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న బృందాలకు విరిగి ముక్కలైన హెలికాప్టర్ కనిపించింది. అక్కడ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడ్డ ఆనవాళ్లు లేవని రెస్క్యూ టీమ్ లీడర్ తెలిపారు.


More Telugu News