ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్... తీర్పు రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

  • ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
  • సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేసిన క్యాట్
  • క్యాట్ ఆదేశాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన సీఎస్
  • విచారణ చేపట్టిన హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి సస్పెన్షన్ విధించగా, ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) కొట్టివేసింది. ఒకే అభియోగంపై రెండు సార్లు ఎలా సస్పెండ్ చేస్తారని క్యాట్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

అయితే క్యాట్ ఆదేశాలపై ఏపీ సీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. 

సీఎస్ తరఫున జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) డిప్యూటీ కార్యదర్శి జయరాం కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంలో క్యాట్ పొరబడిందని జయరాం కోర్టుకు తెలిపారు.

తగిన కారణాలతోనే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయాన్ని క్యాట్ విస్మరించిందని పేర్కొన్నారు. పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా క్యాట్ పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అటు, ఏబీ తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్న హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ తీర్పును రిజర్వ్ లో ఉంచింది.


More Telugu News