సిద్ధరామయ్యకు, తనకు వ్యతిరేకంగా చేతబడి.. ఎక్కడ, ఎలా చేశారో చెప్పిన డీకే శివకుమార్!

  • కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేశారన్న డీకే
  • అఘోరాలు, తాంత్రికులతో తన రాజకీయ ప్రత్యర్థులు యాగ్య పూజ నిర్వహించారని ఆరోపణ
  • మేకలు, గొర్రెలు, గేదెలు, పందులను బలిచ్చినట్టు చెప్పిన శివకుమార్
  • కర్ణాటక రాజకీయ ప్రత్యర్థుల పనేనన్న డిప్యూటీ సీఎం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై చేతబడి చేయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేరళలోని ఓ ఆలయంలో అఘోరాలు, తాంత్రికులతో కలిసి తనపైనా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనా చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు.

కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో అఘోరాలతో తమకు వ్యతిరేకంగా యాగ్య (ప్రత్యేక పూజలు) నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే వారిలా పూజలు నిర్వహించినట్టు ఆరోపించారు. 

'శత్రువుల పీడను వదిలించుకునేందుకు ‘యాగ్య’ పూజలు నిర్వహిస్తారు. దీనిని ‘రాజ కంటక’, ‘మరణ మోహన స్తంభన’ యాగ్య అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలిచ్చినట్టు' శివకుమార్ వివరించారు. 

బీజేపీ కానీ, జేడీఎస్ కానీ ఈ పని చేయించి ఉంటాయా? అన్న ప్రశ్నకు శివకుమార్ బదులిస్తూ.. కర్ణాటక రాజకీయ నాయకుల పనేనని తెలిపారు. ఆ పని ఎవరు చేశారో తనకు తెలుసని, వారు తమ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చని, తనకేమీ బాధ లేదని పేర్కొన్నారు. వారి నమ్మకానికే దానిని వదిలేస్తున్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు తనకు హాని చేస్తాయనుకుంటే తాను నమ్మిన విశ్వాసం తనను కాపాడుతుందని శివకుమార్ తేల్చి చెప్పారు. 

కౌంటర్‌గా మీరు కూడా పూజలు చేస్తారా? అన్న ప్రశ్నకు.. తాను విధుల్లోకి వెళ్లడానికి ముందు ప్రతి రోజు నిమిషం పాటు దేవుడిని ప్రార్థిస్తానని పేర్కొన్నారు. ఆ పూజలు నిర్వహించిన వారి పేర్లు చెప్పమంటే మాత్రం.. ఈ విషయం తనను బలవంతం చేసే కంటే అదెవరో మీరు దర్యాప్తు చేసి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు.


More Telugu News