నీళ్లలో పడ్డ ఐఫోన్ కోసం కేరళ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు

  • ఏడు గంటలు కష్టపడి వెతికి తెచ్చిన టీమ్
  • రెస్క్యూ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన హోటల్
  • ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే సరిపోయేదన్న నెటిజన్లు
విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ ఖరీదైన ఫోన్ ను సముద్రంలో పోగొట్టుకుంది.. ఎంత వెతికినా దొరకకపోవడంతో తానుంటున్న హోటల్ మేనేజ్ మెంట్ ను ఆశ్రయించింది. దీంతో ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని హోటల్ మేనేజ్ మెంట్ రంగంలోకి దించింది. ఏడు గంటల పాటు సముద్రంలో గాలించిన ఆ టీమ్.. ఎట్టకేలకు ఫోన్ ను వెతికి బయటకు తీసుకొచ్చింది. ఈ రెస్క్యూ వీడియోను సదరు హోటల్ యాజమాన్యం ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. క్షణాలలో వైరల్ గా మారింది. అయితే, కొంతమంది యూజర్లు మాత్రం ఓ ఫోన్ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంపై విమర్శలు గుప్పించారు. ఇన్సూరెన్స్ క్లెయిం చేసుకుంటే పోయేదానికి గంటల తరబడి అంతమందిని ఇబ్బంది పెట్టడమేంటని అంటున్నారు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. 

కర్ణాటకకు చెందిన ఓ మహిళ కేరళలో పర్యటిస్తోంది. ఈ టూర్ లో భాగంగా అంటీలియా ఛాలెట్స్ అనే రిసార్ట్ లో బస చేసింది. సరదాగా సముద్ర తీరంలోని కొండ రాళ్లపై ఫొటోలు దిగుతుండగా ఫోన్ జారి నీళ్లలో పడిపోయింది. రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ కావడంతో చాలాసేపు వెతికి నిరాశతో హోటల్ కు చేరుకుంది. రిసార్ట్ మేనేజ్మెంట్ కు విషయం చెప్పడంతో.. రిసార్ట్ కు చెందిన స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. ఫోన్ కోసం తీరంలో గాలించడం మొదలుపెట్టింది. వారికి తోడు కేరళ పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి చేరారు.

అంతా కలిసి దాదాపు ఏడు గంటలకు పైగా కష్టపడ్డారు. ఎట్టకేలకు ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ను సదరు మహిళకు అప్పగిస్తూ ఈ స్టోరీనంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా హోటల్ మేనేజ్ మెంట్.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెస్క్యూ సిబ్బందిని కొంతమంది మెచ్చుకోగా.. మరికొందరు మాత్రం విమర్శించారు. ఖరీదైనదే అయినప్పటికీ ఓ ఫోన్ కోసం అంతమంది, అన్నేసి గంటలపాటు గాలించడమేంటని అన్నారు. ఫైర్ సిబ్బంది తమ విలువైన సమయాన్ని ఓ ఫోన్ ను వెతికేందుకు ఉపయోగించడంపై విస్మయం వ్యక్తం చేశారు.


More Telugu News