వీకే పాండ్యన్‌పై విమర్శలు సరికాదు.. మాజీ సీఎం నవీన్ పట్నాయక్

  • ఎన్నికల్లో పాండ్యన్ అద్భుత పనితీరు కనబరిచాడన్న నవీన్ పట్నాయక్
  • తన వారసుడు వీకే పాండ్యన్ కాదని స్పష్టీకరణ
  • తన తరువాత ఎవరనేది ప్రజలే తేలుస్తారని స్పష్టీకరణ
ఒడిశా ఎన్నికల్లో ఓటమికి తన సహాయకుడు పాండ్యన్‌ను బాధ్యుడిని చేయడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ విమర్శలు దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ఆయన.. పాండ్యన్ మంచి పనితీరు కనబరిచాడని ప్రశంసించారు. 24 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీజేడీ ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ వైఫల్యానికి వీకే పాండ్యన్ బాధ్యుడని పార్టీ వర్గాలు, మద్దతుదారుల విమర్శలకు నవీన్ పట్నాయక్ ముగింపు పలికే ప్రయత్నం చేశారు.   

ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ 147 సీట్లకు గాను 78 సీట్లు సాధించి అధికారం హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. బీజేడీకి 51 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 14, సీపీఐ (ఎమ్)కు ఒక సీటు దక్కింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 20 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ ఒక నియోజకవర్గంలో విజయం సాధించింది. 

కాగా, ప్రజలు ఇచ్చిన తీర్పును తాను హుందాగా స్వీకరిస్తున్నట్టు నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ప్రజాసేవలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పాండ్యన్ తన వారసుడు కాదని కూడా స్పష్టం చేశారు. తన తరువాత ఎవరనేది ప్రజలే  నిర్ణయిస్తారని పేర్కొన్నారు.


More Telugu News