జింబాబ్వే టూర్‌కు టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

  • ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్ల‌నున్న టీమిండియా 
  • ఈ టీ20 సిరీస్‌ కోసం భారత జట్టుతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, ఎన్‌సీఏ కోచ్‌లు
  • ఈ ప‌ర్య‌ట‌న కోసం యువ జ‌ట్టును ఎంపిక చేసే యోచ‌న‌లో బీసీసీఐ
జులై 6 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వేకు వెళ్ల‌నుంది. ఈ టూర్‌కు భార‌త జ‌ట్టు హెడ్‌ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారు. జింబాబ్వేలో టీ20 సిరీస్‌ కోసం భారత జట్టుతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, ఎన్‌సీఏ కోచ్‌లు కూడా వెళ్ల‌నున్నారు. ఇక టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం దాదాపు ఖ‌రారైంద‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న రానుంది. గంభీర్‌తో పాటు ఇంట‌ర్వ్యూకు హాజ‌రైన‌ మాజీ మహిళల జట్టు ప్రధాన కోచ్ డ‌బ్ల్యూవీ రామన్‌ను బోర్డు పక్కన పెట్టింద‌ని తెలిసింది. 

దీంతో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతీ ప్రకటన కేవలం లాంఛనప్రాయం మాత్ర‌మే. అలాగే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌తో కూడిన తన సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా గంభీర్‌కే ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో గౌతీ జులై మధ్యలో శ్రీలంక పర్యటన నుండి కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడ‌ని తెలుస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష్మ‌ణ్ తాత్కాలికంగా ఈ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు.  

కాగా, బీసీసీఐ 'టార్గెటెడ్ ప్లేయర్స్' ప్రస్తుతం ఎన్‌సీఏలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ఇక జూన్ 22 లేదా 23 తేదీల్లో జింబాబ్వే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ టార్గెటెడ్ ప్లేయర్‌ల జాబితాతో సహా ఐపీఎల్‌లో రాణించిన యువ ఆట‌గాళ్ల‌తో లక్ష్మణ్ పర్యవేక్షణలో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ప‌ర్య‌ట‌న కోసం ఒక యువ జ‌ట్టును ఎంపిక చేసే యోచ‌న‌లో బీసీసీఐ ఉంద‌ని స‌మాచారం. అయితే ఈ జ‌ట్టులో ప్ర‌స్తుతం టీ20 ప్రపంచకప్ ఆడుతున్న టీమ్‌లోని ఆరు నుండి ఏడుగురు సభ్యులు ఉంటారని తెలిసింది. రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి, యశ్ దయాల్, హర్షిత్ రాణా వంటి యువ ఆట‌గాళ్లు తొలిసారి జాతీయ జ‌ట్టుకు ఆడే అవ‌కాశం ఉంది. ఇక ఈ జ‌ట్టుకు హార్దిక్ పాండ్యా లేదా సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యం వ‌హించే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పాండ్యా విశ్రాంతి తీసుకుంటే సూర్య‌కు జ‌ట్టు ప‌గ్గాలు ద‌క్కడం ఖాయం.


More Telugu News