దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు: పీఎం మోదీ

  • 18వ లోక్‌సభ తొలి సమావేశాల కోసం పార్ల‌మెంటుకు చేరుకున్న ప్ర‌ధాని మోదీ
  • రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్య‌
  • లోక్‌స‌భ‌కు కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికిన మోదీ 
  • కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి స‌భ్యులంతా కృషి చేయాలన్న ప్ర‌ధాని
  • మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామన్న మోదీ
18వ లోక్‌సభ తొలి సమావేశాల కోసం ప్ర‌ధాని మోదీ పార్ల‌మెంటుకు చేరుకుని మీడియాతో మాట్లాడారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని ప్ర‌ధాని అన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో 18వ లోక్‌సభ సమావేశమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు మోదీ స్వాగతం పలికారు.

"ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించాం. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మా విధానాలకు, అంకితభావానికి జనామోదం లభించింది. ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి" అని మోదీ అన్నారు. 

ఇక 2047 వికసిత్‌ భారత్‌ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతామ‌న్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటామ‌ని తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతామ‌న్న ప్ర‌ధాని.. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తామ‌ని చెప్పారు. 

అలాగే ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ప్రజలను అన్యాయంగా జైళ్లలో పెట్టినట్టు తెలిపారు. 50 ఏళ్లకిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదన్నారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు.


More Telugu News