తొలిసారి వరల్డ్ కప్ సెమీస్ కు ఆఫ్ఘనిస్థాన్... స్వదేశంలో ఓ రేంజిలో సంబరాలు

  • పసికూన స్థాయి నుంచి పరిణతి సాధించిన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘనిస్థాన్
  • టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో న్యూజిలాండ్ ను, సూపర్-8లో ఆసీస్ ను ఇంటికి పంపిన వైనం
  • ఇవాళ బంగ్లాదేశ్ పై చారిత్రాత్మక విజయంతో సెమీస్ చేరిక
  • కాబూల్, జలాలాబాద్ నగరాల్లో రోడ్లపైకి వచ్చిన జనాలు
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో పసికూన అనుకున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇప్పుడు కొరకరాని కొయ్య. ఆఫ్ఘన్ దెబ్బకు టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు ఆ విషయం బాగా అర్థమై ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇవాళ బంగ్లాదేశ్ పై చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారిగా ఓ వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. 

కల్లోలభరిత పరిస్థితులకు చిరునామాగా నిలిచే ఆఫ్ఘనిస్థాన్ లో ఈ విజయం సంతోషాల జల్లు కురిపించింది. రషీద్ ఖాన్ సేన సృష్టించిన చరిత్ర... స్వదేశంలో ఆఫ్ఘన్లను వీధుల్లోకి వచ్చి నాట్యం చేయించింది. 

రాజధాని కాబూల్, జలాలాబాద్ వంటి ముఖ్య నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ క్రికెట్ జట్టు సాధించిన ఘనత పట్ల సంబరాలు జరుపుకున్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనాలతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘన్ లో ఇలాంటి దృశ్యాలు కలలో కూడా ఊహించలేం. కానీ, వారి క్రికెట్ జట్టు హేమాహేమీ జట్లను ఓడించి, వరల్డ్ కప్ సెమీస్ బెర్తును సాధించడం ప్రజల సంబరాలకు కారణమైంది. 

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫ్ఘన్ ఆటగాళ్లు వేడుకలు, స్వదేశంలో వారి అభిమానుల సంబరాల తాలూకు ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి.


More Telugu News