చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. మేర భుజంపై మోసుకెళ్లిన అన్నలు.. యూపీలో విషాదం

  • టైఫాయిడ్ బారినపడిన టీనేజీ బాలిక
  • భారీ వర్షాలు, వరదల వల్ల మెరుగైన వైద్యం అందక మృతి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే సంఘటన చోటుచేసుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజీ బాలిక మెరుగైన వైద్యం అందక కన్నుమూయడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 

లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపిస్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీశాడు. ఆ వీడియోలో రైలు పట్టాల పక్క నుంచి సోదరి మృతదేహాన్ని అన్నలిద్దరూ తీసుకెళ్లడం కనిపించింది. ఆ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు ఉంది. ఈ వీడియోను చూసన నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అధికార వ్యవస్థ ఇలా పనిచేస్తోందని ఓ యూజర్ విమర్శించారు.


More Telugu News