ఇది ఎవరికీ జరగకూడదు: విజయసాయి అంశంపై పేర్ని నాని స్పందన

  • ఓ బిడ్డకు తండ్రి ఎవరనే వివాదంలో చిక్కుకున్న విజయసాయి
  • పేర్ని నానిని స్పందన కోరిన మీడియా
  • ఆధారాలు లేనప్పుడు మీడియా హుందాగా వ్యవహరించాలన్న పేర్ని నాని
  • కానీ మీడియా దిగజారిపోయిందంటూ వ్యాఖ్యలు
ఇది ఎవరికీ జరగకూడదు: విజయసాయి అంశంపై పేర్ని నాని స్పందన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యరీతిలో ఓ వివాదంలో చిక్కుకోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిపై విమర్శలు చేసినప్పుడు, ముఖ్యంగా ఆధారాలు లేని విమర్శలు చేసినప్పుడు మీడియా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇవాళంతా మీడియా నిలువునా చీలిపోయిందని, మీడియా రాజకీయ రంగులు పులుముకుని ఉందని అన్నారు. 

"ఒకవేళ ఒక వ్యక్తి ఆరోపించాడు... మేం వార్త వేశాం అంటే అర్థం ఉంటుంది. పోనీ ఒక స్టోరీ వేశారనుకుంటే... మీడియా దిగజారి చచ్చింది కదా... వేశార్లే అనుకుంటాం. కానీ ఒక చానల్లో స్వయంగా సీఈవోనే కూర్చుని డిబేట్ నిర్వహిస్తే ఏమనాలి? ముసలోడు ఇంత పనోడా? అంటూ ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు... ఏం భాష ఇది? నువ్వొక జర్నలిస్టువి, సీఈవోగా ఉన్నావు, ఎంత హుందాగా ఉండాలి. 

ఏమైనా ఆధారాలు ఉంటే... మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా, వ్యక్తిత్వ హననం చేస్తూ, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా చంపడానికి దుష్ప్రచారాలు చేస్తున్నారు... ఇంకా రాజకీయ కక్షతో మానసికంగా పతనం చేయడానికి ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి విషయాలను డిబేట్ గా పెడుతున్నారు. ఇది ఎవరికీ జరగకూడదు, ఎక్కడా జరగకూడదు. 

ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడితే, దాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. డిబేట్లు నిర్వహిస్తూ, దానికి కొనసాగింపుగా పార్టీ మహిళా కార్యకర్తలతో టీవీ చానళ్లలో తిట్టిస్తున్నారు. ఎవరైనా సరే... ఇది పద్ధతి కాదు. మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయడం సరికాదు" అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.


More Telugu News