టెలికాం సంస్థలకు ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు.. ఇక‌పై వినియోగ‌దారుల‌కు పరిహారం!

  • కంపెనీలకు కనీస అపరాధ రుసుమును రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచిన‌ ట్రాయ్
  • నిబంధనల ఉల్లంఘనల గ్రేడ్లను బట్టి రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల మేర ఫైన్‌
  • ఆరు నెలల తర్వాత అమల్లోకి ట్రాయ్ కొత్త నిబంధనలు
టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త‌ నిబంధనలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా విధించ‌నున్నట్లు స్పష్టం చేసింది.

ఇక ట్రాయ్ తీసుకొచ్చిన‌ కొత్త సేవా నిబంధనల ప్రకారం, జిల్లా స్థాయిలో నెట్‌వ‌ర్క్‌ అంతరాయం కలిగితే పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు అయితే కనెక్షన్‌ చెల్లుబాటు గడువు పెంచాలి. 

నెట్‌వ‌ర్క్‌ అంతరాయం 24 గంటలకు మించితే సర్వీసు ప్రొవైడర్లు అద్దెలో కొంత భాగాన్ని రిబేటుగా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదార్లకు వచ్చే బిల్‌ సైకిల్లో వాటిని చూపించాలి. 12 గంటలకు పైగా అంతరాయం ఉన్నా అద్దెలో రిబేటు లేదా వ్యాలిడిటీ కొనసాగింపునకు దానికి ఒక రోజుగానే పరిగణించాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా నెట్వర్క్ స‌మ‌స్య‌ లేకుండా చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మాత్రమే, ఈ ప్రయోజనాలను అందించాల్సిన అవసరం ఉండదు.

జరిమానాలు ఇలా..
నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే కంపెనీలకు కనీస అపరాధ రుసుమును రూ.50,000 నుంచి రూ.1లక్షకు పెంచింది ట్రాయ్. నిబంధనల ఉల్లంఘనల గ్రేడ్లను బట్టి రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల మేర జరిమానాను విధిస్తుంది. ప్రైమరీ, సెల్యులార్‌ మొబైల్‌ సర్వీసెస్, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు, బ్రాడ్‌ బ్యాండ్‌ వైర్లెస్‌ సేవలకు ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఫిక్స్డ్‌ లైన్‌ సర్వీసు ప్రొవైడర్లు అయినా పోస్ట్‌ పెయిడ్, ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. తమ నెట్‌వ‌ర్క్‌లోని  వైఫల్యానికి మూడు రోజుల్లోగా పరిష్కారం చూపాల్సిందే. చెల్లింపు చేసిన 7 రోజుల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసు ప్రొవైడర్లు 98 శాతం కనెక్షన్లను యాక్టివేట్‌ చేయాలి. టెల్కోలు తమ వెబ్‌సైట్లలో సర్వీసు ప్రకారం (2జీ, 3జీ, 4జీ, 5జీ) జియో స్పేషియల్‌ కవరేజీ మ్యాప్లను వినియోగదారుల సౌకర్యం కోసం త‌ప్ప‌కుండా ఇవ్వాల్సి ఉంటుంది.

కాగా, మరో ఆరు నెలల తర్వాత ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు టెలికాం ఆపరేటర్ల నుండి జవాబుదారీతనం ఉండేలా చూడటమే లక్ష్యంగా కొత్త నిబంధనలను ట్రాయ్ తీసుకువ‌స్తోంది. ఈ నిబంధనలను అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా టెలికాం సేవల్లో వినియోగ‌దారుల‌ సంతృప్తి, విశ్వసనీయతను పెంచడానికి ట్రాయ్ ప్రయత్నిస్తుంది.


More Telugu News