మాల్దీవుల అధ్యక్షుడితో కేంద్రమంత్రి జైశంకర్ భేటీ

  • మూడు రోజుల పర్యటన నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన జైశంకర్
  • రేపటి వరకు మాల్దీవుల్లోనే జైశంకర్
  • సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడి
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ నిన్న మాల్దీవులకు వెళ్లారు. తన పర్యటనలో రెండో రోజైన శనివారం ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

రేపటి వరకు మాల్దీవుల్లోనే ఉండనున్న జైశంకర్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. జైశంకర్ చివరిసారి 2023 జనవరిలో ఆ దేశంలో పర్యటించారు. ఆ తర్వాత ముయిజ్జు ఈ ఏడాది జూన్‌లో మన దేశంలో పర్యటించారు.

మాల్దీవుల ప్రధానితో భేటీకి సంబంధించిన ఫొటోను జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అధ్యక్షుడితో భేటీ కావడం విశేషమన్నారు. భారత ప్రజలు, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం భారత్-మాల్దీవుల సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ముయిజ్జు మాట్లాడుతూ... భారత్ తమకు ఎప్పుడూ మిత్రదేశమే అన్నారు. తమకు అవసరం వచ్చినప్పుడల్లా సహాయాన్ని అందిస్తుందని గుర్తు చేసుకున్నారు.


More Telugu News