రూ. 850 కోట్ల విలువైన 50 గ్రాముల ‘కాలిఫోర్నియం స్టోన్’ సీజ్

  • బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఘటన
  • కాలిఫోర్నియంను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • ఒక్క గ్రాము కాలిఫోర్నియం విలువ రూ. 17 కోట్ల పైమాటే
  • కేన్సర్ చికిత్సలోను, అణురియాక్టర్లలోనూ ఉపయోగం
బీహార్‌లోని గోపాల్‌గంజ్ పోలీసులు అత్యంత అరుదైన రేడియో యాక్టివ్ పదార్థం ‘కాలిఫోర్నియం స్టోన్’ సీజ్ చేశారు. 50 గ్రామలు బరువున్న ఈ స్టోన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. 850 కోట్ల పైమాటే. దీనిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియం గ్రాము ధర రూ. 17 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిని అణువిద్యుత్ కేంద్రాలు, కేన్సర్ చికిత్సలలో వాడుతుంటారు. 

నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన చోటేలాల్ ప్రసాద్ (40), గోపాల్‌గంజ్‌కు చెందిన చందన్ గుప్తా (40), చందన్‌రామ్‌గా గుర్తించారు.  వీరు తమ వద్దనున్న ఈ కాలిఫోర్నియంను విక్రయించేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జిల్లాలోని బాల్‌థారి చెక్‌పోస్ట్ వద్ద కాపుకాసి పట్టుకున్నారు.

నిందితులు తమను తాము ఐఐటీ మద్రాస్‌కు చెందిన వారిగా చెప్పుకున్నారు. వారి నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్టును కూడా స్వాధీనం చేసుకున్నట్టు గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు. ఐఐటీ మద్రాస్‌ను సంప్రదిస్తే వారు చెప్పిందని అబద్దమని తేలిందని పేర్కొన్నారు. ఆ తర్వాత వారి నుంచి స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియంను పరీక్షల కోసం అణుశక్తి విభాగానికి పంపారు. కాగా, ఈ పదార్థాన్ని బొగ్గు గని కార్మికుడు ఒకడు తనకు ఇచ్చినట్టు నిందితులు చెప్పారని ఎస్పీ తెలిపారు.

అత్యంత అరుదైన కాలిఫోర్నియంను దేశంలో కొనుగోలు, విక్రయించడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో నిందితులకు ఈ పదార్థం ఎక్కడ లభించింది? ఎవరికి విక్రయించాలనుకున్నారు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, మూడు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 340 గ్రాముల కాలిఫోర్నియంను సీజ్ చేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది.

   


More Telugu News