ఇద్దరు మహిళా పేషెంట్లపై డాక్టర్ అఘాయిత్యం... ఒడిశాలో దారుణం

  • ఒడిశాలోని కటక్‌లో వెలుగుచూసిన దారుణం
  • ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులపై అత్యాచారం
  • ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
ఒడిశాలో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు మహిళా రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడనే అభియోగాలపై ఓ వైద్యుడిపై కేసు నమోదైంది. రాష్ట్రంలోని కటక్‌ నగరంలో ఉన్న ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళా పేషెంట్లు ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష కోసం ఆదివారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగానికి వచ్చారని, ఆ సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.

బాధిత మహిళలు ఇద్దరూ మంగలాబాగ్ పోలీస్ స్టేషన్‌ లో సోమవారం నాడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, కేసు నమోదయిందని కటక్ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. 

ఈ ఘటనకు పాల్పడింది ఒక రెసిడెంట్ డాక్టర్‌ అని, అతడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  ఏర్పాటు చేసిందని చెప్పారు. కాగా నిందిత వైద్యుడిని రోగుల బంధువులు కొట్టారని, అయితే ఈ ఘటనపై తమకు అధికారికంగా ఫిర్యాదు అందలేదని మిశ్రా వివరించారు.


More Telugu News