కోల్‌కతా ఘటనపై నటుడు ఆయుష్మాన్ ఖురానా కంటతడి పెట్టించే కవిత

  • కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారంపై ఆవేదనగా స్పందించిన బాలీవుడ్ నటుడు
  • ‘నేను అబ్బాయిని అయితే..’ ఈ రోజు బతికి ఉండేదాన్నంటూ మృతురాలి ఆవేదనను కళ్లకు కట్టిన ఆయుష్మాన్ ఖురానా
  • అత్యంత బలమైన సందేశం అని కీర్తించిన హర్ష గోయెంకా
‘నేనే అబ్బాయిని అయితే..’ అంటూ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా రాసిన కవిత ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ ఆయనీ కవితను రాశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా దానిని చదివి వినిపించారు.

నేను అబ్బాయిని అయితే గది తలుపులు వేయకుండానే నిద్రపోవచ్చు 
నేనే అబ్బాయిని అయితే స్వేచ్ఛగా పరిగెత్తొచ్చు
రాత్రంతా స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగొచ్చు
ఆడపిల్లలను చదివించాలని, వారిని బలంగా తీర్చి దిద్దాలని ఎంతోమంది చెబుతుంటారు
తీరా వారు కష్టపడి డాక్టర్ అయినా కూడా.. ఆ కంటిరెప్పను కాపాడుకోవాల్సిన పరిస్థితే ఉంది
అదే నేను అబ్బాయిని అయి ఉంటే..!

‘ఈ రోజు నాపై బలాత్కారం జరిగింది. ఓ దుర్మార్గుడి క్రూరత్వాన్ని కళ్లారా చూశా.
సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదుగా!
పురుష భద్రతా సిబ్బందిని పెట్టినా.. అతడు తన విధిని స్వచ్ఛంగా నిర్వర్తించి ఉండేవాడా?
అందుకే నేను అబ్బాయిని అయితే బాగుండేది. 
ఒకవేళ నేను అబ్బాయిని అయి ఉంటే ఈ రోజు బతికి ఉండేదాన్ని! 
అంటూ అకృత్యానికి బలైన జూనియర్ వైద్యురాలి ఆవేదనను ఆయుష్మాన్ కళ్లకు కట్టినట్టు వివరించారు.

ఆయుష్మాన్ ఖురానా కవితపై నెటిజన్లు కూడా అంతే ఆవేదనగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా కూడా స్పందించారు. ‘అత్యంత బలమైన సందేశం’గా దీనిని ప్రశంసించారు.


More Telugu News