వినేశ్ ఫోగాట్ ప్రాణాల మీదికి తెచ్చుకుంటుందేమోనని భయపడిన కోచ్

  • అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన వినేశ్ ఫోగాట్ 
  • ఒలింపిక్ ఫైనల్ కు ముందు రాత్రి బరువు తగ్గేందుకు కఠిన ప్రయత్నాలు చేసిందని కోచ్ పూలర్ అకోస్ వెల్లడి
  • ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని ఆందోళన చెందామని వ్యాఖ్య  
పారిస్ ఒలింపిక్ క్రీడల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. అయితే న్యాయపోరాటంలో వినేశ్ కు ఒలింపిక్ మెడల్ దక్కుతుందని భావించిన భారత్ కు నిరాశే మిగిలింది. తనకు షేర్డ్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని, సెమీ ఫైన్లల్స్ వరకు నిర్ణీత బరువుతోనే తలపడిన అంశాన్ని పరిగణించాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) లో వినేశ్ అప్పీల్ చేసుకోగా, ఆ అప్పీల్ ను బుధవారం తిరస్కరించింది. దీంతో ఒలింపిక్ రజత పతకం వస్తుందన్న ఆశలు అవిరి అయ్యాయి. మహిళల 50 కేజీల విభాగం ఫైనల్ లో వినేశ్ వంద గ్రాములు అధిక బరువు ఉండటంతో ఫైనల్స్ ఆడలేకపోయారు. అనర్హత వేటు పడింది. కాగా, వినేశ్ కోచ్ మరియు సిబ్బంది బరువు తగ్గడానికి ఎన్నో పద్ధతులను అనుసరించారు. అయినప్పటికీ విజయం సొంతం కాలేదు.

ఇదిలా ఉంటే వినేశ్ ఫోగాట్ కోచ్ పూలర్ అకోస్ సోషల్ మీడియా (ఫెస్ బుక్) ద్వారా ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఒలింపిక్ ఫైనల్ కు ముందు రోజు రాత్రి వినేశ్ బరువు తగ్గేందుకు దాదాపు అయిదున్నర గంటల పాటు వివిధ రకాల కఠిన ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత వినేశ్ చనిపోతుందేమోనని భయపడ్డామని అన్నారు. తొలి ఒలింపిక్స్ ను సాధించడానికి వినేశ్ తన జీవితాన్ని లెక్కచేయలేదని కోచ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

 సెమీ ఫైనల్ తర్వాత ఆమె 2.7 కిలోల బరువు ఎక్కువగా ఉండగా, ఒక గంట 20 నిమిషాలు వ్యాయామం చేసిందన్నారు. కానీ అప్పటికీ 1.5 కిలోలు బరువు ఎక్కువగా ఉందని దీంతో అర్ధరాత్రి నుండి వేకువజాము 5.30 వరకూ వినేశ్ వివిధ కార్డియో మేషీన్లు, రెజ్లింగ్ కదలికలపై పని చేసిందన్నారు. ఒక గంటలో కొన్ని నిమిషాలు విరామం తీసుకుని 40 – 45 నిమిషాల పాటు కసరత్తులు చేస్తూనే ఉందన్నారు. పడుతూ లేస్తూ వర్క్ అవుట్స్ చేసిందని, చివరి గంటలో మొత్తం చెమటతో తడిసిపోయిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె చనిపోతుందేమోనని భయపడినట్లు కోచ్ పూలర్ అకోస్ వివరించారు.


More Telugu News