పాక్ జట్టుకు డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత... బంగ్లాదేశ్ కు కూడా!

  • రావల్పిండి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన పాక్
  • స్లో ఓవర్ రేట్ తప్పిదంతో 30 శాతం మ్యాచ్ ఫీజు, 6 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత
  • బంగ్లాదేశ్ సైతం స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురైన వైనం
మూలిగే నక్కపై తాటిపండు పడడం అంటే ఇదే! ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో రావల్పిండి టెస్టులో దారుణంగా ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై మరో దెబ్బ పడింది. మొదటి టెస్టులో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన పాక్ జట్టుకు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కోత విధించారు. 

నిర్దేశిత సమయానికి పాక్ జట్టు 6 ఓవర్లు తక్కువగా బౌల్ చేసింది. దాంతో, పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు, 6 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత పడింది. 

అటు, రావల్పిండి టెస్టులో చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ జట్టుకు కూడా జరిమానా పడింది. బంగ్లాదేశ్ కూడా స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినట్టు గుర్తించారు. దాంతో, 15 శాతం మ్యాచ్ ఫీజు, 3 డబ్ల్యూటీసీ పాయింట్లను బంగ్లా జట్టు కోల్పోనుంది. 

ఇక, మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తో అనుచితంగా వ్యవహరించిన బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా కేటాయించారు.


More Telugu News