విజయవాడ పోలీసులను కలిసిన నటి కాదంబరి జెత్వానీ... వివరాలు తెలిపిన న్యాయవాది నర్రా శ్రీనివాస్

  • గతంలో సజ్జన్ జిందాల్ పై రేప్ కేసు పెట్టిన నటి కాదంబరి జెత్వానీ
  • ఆ కేసు వెనక్కి తీసుకోవాలని తనను, తన కుటుంబాన్ని వేధించారంటున్న నటి
  • ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం
  • నేడు విజయవాడ వచ్చిన కాదంబరి జెత్వానీ
నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇప్పటిదాకా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పేరు వినిపించింది. కానీ, ఆమె సమస్యలన్నింటికీ మూలకారణం ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ వ్యవహారం అని తెలుస్తోంది. అప్పట్లో సజ్జన్ జిందాల్ పై నటి కాదంబరి జెత్వానీ రేప్ కేసు పెట్టారు. 

ఈ కేసు ఉపసంహరించుకునేలా చేసేందుకే ఆమెపై తీవ్ర ఒత్తిళ్లు, వేధింపులు వచ్చాయని, తప్పుడు కేసు పెట్టారని తాజాగా వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్ ఒక భాగం మాత్రమేనని... ఇందులో ఏపీకి చెందిన పలువురు ఐపీఎస్ లు, ఒక ఐఏఎస్, మరికొందరు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, నటి కాదంబరి జెత్వానీ నేడు ముంబయి నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ పోలీసులను కలిసి తాను ఎదుర్కొన్న పరిణామాలను వివరించారు. దీనిపై కాదంబరి జెత్వానీ న్యాయవాది నర్రా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 

విజయవాడ పోలీసులు ముంబయి నటి జెత్వానీ, ఆమె తల్లి వాంగ్మూలం నమోదు చేస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పోలీసులు తనను ఇబ్బందులకు గురిచేశారన్న విషయాన్ని ఆమె విజయవాడ పోలీసులకు చెబుతున్నారని తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారని న్యాయవాది నర్రా శ్రీనివాస్ వెల్లడించారు. 

41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారని, నటి జెత్వానీ తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారని వివరించారు. జెత్వానీపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారుచేసిందేనని న్యాయవాది నర్రా శ్రీనివాస్ ఆరోపించారు. 

జెత్వానీపై ఈ ఒక్క కేసు తప్ప ఎక్కడా ఎలాంటి కేసులు లేవని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది నర్రా శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను హనీ ట్రాప్ చేసిందన్న ఆరోపణల్లో నిజం లేదని జెత్వానీ స్పష్టం చేస్తున్నారని నర్రా వివరించారు. 

సోషల్ మీడియాలో కానీ, ఇతర మీడియా వేదికల్లోనూ తనపై దుష్ప్రచారం చేస్తే చట్ట  ప్రకారం చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరిస్తున్నారని తెలిపారు. 

"ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆమె చెబుతున్నారు. ప్రధానంగా నాటి ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఆంజనేయులు, పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాణా టాటా, మరో పోలీస్ అధికారి విశాల్ గున్నీ... వీరు ముగ్గురు ఉన్నారు. 

ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఏమిటంటే... ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబయి వెళ్లి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే ఫిర్యాదుదారుడిగా పెట్టుకుంటే బాగుంటుందో ముందే ఆలోచించుకుని, విజయవాడకు చెందిన ఒక వ్యక్తిని రంగంలోకి దింపారు. అదే విధంగా అగ్రిమెంట్ ను కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగానే జరిగినట్టు నటి కాదంబరి జెత్వానీ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇవే విషయాలను ఆమె పోలీసులకు తెలియజేస్తున్నారు. 

ముంబయి కేసును వెనక్కి తీసుకోవడం కోసం అగ్రిమెంట్ పై సంతకాలు చేయాలని ఇద్దరు పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని ఆమె చెబుతోంది. ఆ ఇద్దరు స్థానిక పోలీసు అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతోంది. సీసీ టీవీ కెమెరా ఫుటేజి పరిశీలించడం ద్వారా వాళ్లెవరన్నది తేలుతుంది" అని న్యాయవాది నర్రా శ్రీనివాస్ వివరించారు.


More Telugu News