తెలంగాణలో ఇక నేరుగా మొబైల్ ఫోన్లకే ట్రాఫిక్ చలాన్లు!

  • ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే నేరుగా మొబైల్ కు చలానాలు!
  • నూతన వ్యవస్థ ఏర్పాటు దిశగా రవాణా శాఖ యోచన
  • పైలట్ ప్రాజెక్టుగా తొలుత నగరాల్లో ఏర్పాటునకు రవాణా శాఖ ప్రతిపాదనలు
వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలనా (జరిమానా) వేస్తున్నారు. అయితే వాహనదారులు చెక్ చేసుకుంటేనో..లేక ఎక్కడైనా వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు నిలుపుదల చేసిన సమయంలోనో ఎన్ని చలాన్లు పెండింగ్ లో ఉన్నాయో.. ఎంత చెల్లించాలో తెలిసేది. తమ వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలియకపోవడంతో వాహనదారులు వాటిని చెల్లించడం లేదు. దీంతో చలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ చలానాల చెల్లింపులకు కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సందర్భంలో నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్ కు ట్రాఫిక్ చలాన్ లు పంపించడంతో పాటు వాటి సులభతర చెల్లింపులకు కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ అప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట. వాహనదారుల చలానా జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. 

దీంతో ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. అయితే ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు నేరుగా వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపే విధానం తీసుకువస్తే వాహనదారులకు చెల్లింపులు సులభతరం అవుతాయని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.


More Telugu News