రాకెట్‌లా దూసుకెళ్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఆదాయం.. ఈ ఏడాది ఏకంగా 340 శాతం పెరుగుదల

  • మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 229.20 లాభాలు ఆర్జించిన సీఎస్‌కేఎల్
  • మొత్తంగా రూ. 676.40 కోట్ల ఆదాయం 
  • ఎస్‌వీపీఎల్‌కు చెన్నైలో 11 క్రికెట్ అకాడమీలు
  • నిర్వహణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్న ఎస్‌వీపీఎల్
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (సీఎస్‌కేఎల్) ఆదాయం ఈసారి రాకెట్‌లా ఎగబాకింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 340 శాతం నిరక లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 52 కోట్ల ఆదాయం మాత్రమే సాధించగా, ఈసారి అది రూ. 229.20 కోట్లకు చేరుకుంది. బీసీసీఐ కేంద్ర హక్కులు, పెరిగిన టికెట్ల విక్రయాలే ఈ లాభాలకు కారణంగా తెలుస్తోంది. ఇక, 2023 ఆర్థిక సంవత్సరంలో 292.34 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 131 శాతం వృద్ది చెంది రూ. 676.40 కోట్లకు చేరుకుంది. 

ఐదు టైటిళ్లు.. 10సార్లు ఫైనల్‌కు
ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న సీఎస్‌కే జట్టు 5 టైటిళ్లు గెలుచుకుంది. 10 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 17వ ఐపీఎల్ సీజన్‌లో మాత్రం జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది. సూపర్ కింగ్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌వీపీఎల్)కు తమిళనాడులో మొత్తం 9 కేంద్రాలు, రెండు అంతర్జాతీయ క్రికెట్ అకాడమీలు ఉన్నాయి. చెన్నై, సేలంలోని క్రికెట్ అకాడమీలు 1,100 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చాయి. వీరిలో 19 మంది వివిధ స్థాయుల్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించారు.

రూ. 1.61 కోట్లకు తగ్గిన నిర్వహణ నష్టాలు
ఎస్‌వీపీఎల్ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.56 కోట్లు మాత్రమే ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది రెండింతలై రూ. 5.47 కోట్లకు చేరుకుంది. నిర్వహణ నష్టాలు రూ. 6.34 కోట్ల నుంచి రూ. 1.61 కోట్లకు తగ్గినట్టు ఎస్‌వీపీఎల్ పేర్కొంది.


More Telugu News