ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు

  • ఈ నెల 1న కృష్ణానదికి భారీ వరద 
  • వరదలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్‌లను ఢీకొన్న పడవలు.. గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసం
  • ఒకేసారి నాలుగు పడవలు బ్యారేజ్ వద్దకు వచ్చి గేట్లను ఢీకొనడంపై ఇరిగేషన్ అధికారుల్లో అనుమానాలు
విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్‌లను పడవలు ఢీ కొట్టిన ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న కృష్ణానదికి భారీగా వరద వచ్చింది. ఆ తెల్లవారుజామున మూడు భారీ మర పడవలు, ఒక చిన్న పడవ కృష్ణానదిలో ఎగువ నుండి కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయి. దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి.

ఒకేసారి నాలుగు పడవలు రావడంపై ఇరిగేషన్ అధికారులకు అనుమానాలు రేకెత్తాయి. నాలుగు మర పడవలు బ్యారేజి గేటును ఢీ కొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ శుక్రవారం విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో  పోలీసులు బ్యారేజ్ ని పడవలు ఢీ కొట్టిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.


More Telugu News