ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌

  • 'యువ‌గ‌ళం పాద‌యాత్ర' సంద‌ర్భంగా ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చిన లోకేశ్‌ 
  • చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో డ‌యాల‌సిస్ కేంద్రం ఏర్పాటు
  • బంగారుపాళ్యం, ఐరాల‌, అర‌గొండ ప్రాంతాల‌కు చెందిన రోగుల‌కు ఊర‌ట‌
మంత్రి నారా లోకేశ్ త‌న 'యువ‌గ‌ళం పాద‌యాత్ర' సంద‌ర్భంగా ఇచ్చిన మాట‌ను తాజాగా నెర‌వేర్చారు. 'యువ‌గళం.. మ‌న‌గ‌ళం' నినాదంతో మొద‌ట చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్‌ పాద‌యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా పాద‌యాత్ర పూర్త‌యిన ప్ర‌తి 100 కిలోమీట‌ర్ల వ‌ద్ద ఒక శిలాఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్కరించారు. 

ఈ సంద‌ర్భంగా మొద‌టి 100 కిమీ మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్నారు. దాంతో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 100 రోజుల్లో గ్రామంలో డ‌యాల‌సిస్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని లోకేశ్ ఆవిష్క‌రించిన శిలాఫ‌ల‌కంలో పొందుప‌రిచారు. 

అలా ఇచ్చిన మాట ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా వంద రోజులు పూర్తి చేసుకోవ‌డంతో బంగారుపాళ్యంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కావాల్సిన యంత్రాలు, స్పెష‌ల్ నీటి శుద్ధి ప‌రిక‌రాలు, ప‌డ‌క‌లను సెంట‌ర్‌లో ఏర్పాటు చేశారు.

బంగారుపాళ్యం, ఐరాల‌, అర‌గొండ త‌దిత‌ర ప్రాంతాల‌కు చెందిన సుమారు 72 మంది డ‌యాల‌సిస్ రోగులు ప్ర‌స్తుతం చిత్తూరుకు వెళ్లి డ‌యాల‌సిస్ చేయించుకుంటున్నారు. ఇక‌పై వారికి ఆ అవ‌స‌రం లేదు. ఈ కేంద్రం వారంద‌రికీ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ఆసుప‌త్రి సిబ్బంది పేర్కొన్నారు.


More Telugu News