మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గంలో స్కిల్ సెన్సస్ ఆరంభం

  • పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మంత్రి లోకేశ్ నియోజ‌క‌వ‌ర్గం
  • ఇంటింటికీ తిరిగి నైపుణ్య‌ గ‌ణ‌న చేస్తున్న యంత్రాంగం
  • ఉద్యోగ‌, ఉపాధి అవకాశాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌నున్న స్కిల్ సెన్స‌స్‌
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ కు సంబంధించి తొలి అడుగు పడింది. నేడు మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గంలో స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలోనూ ఇవాళ స్కిల్ సెన్సస్ చేపట్టారు. 

మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ లో భాగంగా వివరాలు సేకరించారు. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ విభాగం ప్రధాన కార్యాలయం నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 

ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగాల‌లో ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన ప్ర‌భుత్వం ఈ దిశ‌గా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. పరిశ్రమలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ, ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, శిక్షణ, నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణ చేప‌ట్టి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. 

ఎంత మంది నిరుద్యోగులున్నారు? వారి నైపుణ్యాలు ఏంటి? వారు ఏ వ‌య‌స్సు వారు? ఏ ప్రాంతంలో ఉద్యోగం-ఉపాధి కోరుకుంటున్నారు? అనే అంశాలు స్కిల్ సెన్స‌స్ ద్వారా సేక‌రించి...వీరందరికీ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే బృహ‌త్త‌ర కార్య‌క్రమానికి తొలి అడుగు పడింది.


More Telugu News