మీరెక్కడున్నా హైదరాబాద్ ను, తెలంగాణను ప్రమోట్ చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

  • గచ్చిబౌలి ఐఎస్ బీలో నాయకత్వ సదస్సు
  • హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • నాయకులకు తెగువ, త్యాగం అనే రెండు లక్షణాలు ఉండాలని వెల్లడి
  • గొప్ప పనులు చేయాలంటే తెగించాల్సిందేనని స్పష్టీకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) నాయకత్వ సదస్సుకు హాజరయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

ఐఎస్ బీ ఈ ఏడాది 'నవ్య భారతదేశంలో నాయకత్వం' అనే అంశాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "నా ఉద్దేశం ప్రకారం... నాయకులకు రెండు ప్రధాన లక్షణాలు ఉండాలి. అవి తెగువ, త్యాగం. గొప్ప గొప్ప కార్యాలు సాధించాలంటే తెగించి నిర్ణయాలు తీసుకోవాలి. 

ఐఎస్ బీ విద్యార్థులు అసాధారణ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎస్ బీ విద్యార్థులకు నేనిచ్చే పిలుపు ఏంటంటే... ప్రపంచంలో మీరెక్కడ ఉన్నా హైదరాబాద్ ను, తెలంగాణను ముందుకు తీసుకెళ్లేలా వ్యవహరించండి" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

కాగా, ఐఎస్ బీ సదస్సు సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ప్రాంగణంలో ఓ మొక్కను నాటారు.


More Telugu News