పుష్ప-2 ది రూల్‌ విడుదల తేదీ మారింది!

  • డిసెంబరు 5న పుష్ప-2 విడుదల అంటూ సోషల్‌మీడియాలో న్యూస్‌
  • గురువారం జరిగే ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇవ్వనున్న నిర్మాతలు 
  • 1000 కోట్లకు పైగా పుష్ప-2 ప్రీ రిలీజ్ బిజినెస్‌ అంటోన్న ట్రేడ్‌ వర్గాలు 


అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాందించుకున్న ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇదే కలయికలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్‌' బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకోవడమే ఈ క్రేజ్‌కు కారణం. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప-2పై అంచనాలు కూడా బాగానే వున్నాయి.

 ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు కూడా మరోవైపు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు ఒక హైలైట్‌గా నిలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొదటగా నిర్మాతలు ఈ చిత్రాన్ని డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే డిసెంబరు 5న ఇండియాలో, డిసెంబరు 4న ఓవర్సీస్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డిసెంబరు 5 అర్థరాత్రి నుంచి ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం ప్రీమియర్స్‌ను ప్లాన్‌ చేస్తున్నారు‌. ఇక రేపు అనగా అక్టోబర్‌ 24న హైదరాబాద్‌లో జరిగే పుష్ప-2 ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

నవంబరు 10 నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్‌ కూడా ఎగ్రెసివ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఇక పుష్ప-2 చిత్రం 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ పాజిల్‌, అజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.


More Telugu News