సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా

  • జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
  • నవంబర్ 11న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఖన్నా
  • నవంబర్ 10న ముగియనున్న జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. సంజీవ్ ఖన్నా నవంబర్ 11న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ వెల్లడించారు.

ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది. దీంతో జస్టిస్ ఖన్నా పేరును చంద్రచూడ్ సిఫార్సు చేయగా... రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13వ తేదీ వరకు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 

ఆయన 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తీస్‌హజారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 


More Telugu News