దీన్ని రాజకీయం చేయొద్దు... ఎలాంటి అపోహలు సృష్టించవద్దు: బీసీ కమిషన్ చైర్మన్

  • ఏ తప్పుడు సమాచారం ఇచ్చినా చర్యలు తప్పవని హెచ్చరిక
  • అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని వ్యాఖ్య
  • కులగణనలో అన్ని కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలన్న చైర్మన్
కులగణన సర్వే సందర్భంగా కులం పేరును తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. కులగణన సందర్భంగా ఏ రకమైన తప్పుడు సమాచారం ఇచ్చినా... తప్పుడు సమాచారం నమోదు చేసుకున్నా చర్యలు తప్పవన్నారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ... కులగణన చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటామన్నారు.

దాదాపు 90 వేల ఎన్యుమరేటర్లు కులగణన ప్రక్రియలో పాల్గొంటున్నట్లు చెప్పారు. దీనిని రాజకీయం చేయవద్దని... ఎలాంటి అపోహలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. కులగణనతో బీసీలే కాదు... ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలుతుందని వెల్లడించారు. రిజర్వేషన్‌లో తమను వేరే గ్రూప్‌లకు మార్చాలని పలు కులాలు కోరుతున్నాయని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కేటీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమయ్యాయో దేవుడికే తెలియాలన్నారు.

జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నారని చెప్పుకుంటున్నామని, అది నిరూపించడానికి ఈ సర్వే కీలకమన్నారు. కులగణనతో బీసీలతో పాటు అన్ని కులాల జానాభా లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయన్నారు. ఒత్తిళ్లకు లొంగకుండా తమ దృష్టికి వచ్చిన అన్ని విషయాలనూ పొందుపరుస్తామన్నారు. కులగణన నేపథ్యంలో అన్ని కుల సంఘాలు కీలక పాత్రను పోషించాలన్నారు. సర్వే సక్రమంగా జరగాలంటే అందరి సహకారం ఉండాలన్నారు.

తమకు న్యాయస్థానాలపై గౌరవం ఉందని, కోర్టులు సూచించినట్లే తాము ముందుకు వెళతామన్నారు. న్యాయనిపుణుల సలహా మేరకు నవంబరు 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగిస్తామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో వివిధ రకాల విజ్ఞప్తులు వస్తున్నాయని, ఎప్పుడూ వినపడని కులాల పేర్లు కూడా వస్తున్నాయన్నారు. అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నట్లు చెప్పారు.


More Telugu News