మహారాష్ట్ర ఎన్నికలకు ముందు శరద్ పవార్ అనూహ్య ప్రకటన

  • భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన రాజకీయ దిగ్గజం
  • రాజ్యసభ ఎంపీ పదవీకాలం ముగిసిన తర్వాత పోటీకి దూరంగా ఉంటానని వెల్లడి
  • ప్రజలకు సేవ చేయడం మాత్రం ఆపబోనున్న రాజకీయ కురువృద్ధుడు
రాజకీయ కురువృద్ధుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం లేదని ఆయన వెల్లడించారు. రాజ్యసభ ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి కొనసాగాలా లేదా అనేదానిపై ఆలోచిస్తానని ఆయన వెల్లడించారు. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ గడువు సమీపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
 
‘‘నేను 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. లోక్‌సభకు పోటీ చేయను. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోను. ఏ ఎన్నికల్లోనూ మీరు నన్ను ఓడించలేదు. ప్రతి ఎన్నికలోనూ మీరు నన్ను గెలిపించారు. కాబట్టి నేను ఎక్కడో ఒక చోట ఆపాలి. కొత్త తరాన్ని తీసుకురావాలి. అయితే నేను సామాజిక సేవను వదలడం లేదు. నాకు అధికారం అక్కర్లేదు’’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. తన మనవడు యుగేంద్ర పవార్‌కు మద్దతుగా బారామతి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల బహిరంగ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా శరద్ పవార్ నొక్కి చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి తాను ఏ ఎన్నికల్లోనూ గెలవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘‘నేను అధికారంలో లేను. నేను రాజ్యసభలో ఉన్నాను. రాజ్యసభ ఎంపీ గడువు ఇంకా ఒకటిన్నర సంవత్సరాలే మిగిలి ఉంది. నేను ఇప్పటికే 14 ఎన్నికల్లో పోటీ చేశాను. ఇంకా ఎన్నిసార్లు పోటీ చేస్తాను. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల వారికి, ఆదివాసీలకు అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం నేను చేస్తున్న సేవను కొనసాగించడానికి ఎన్నికలు అవసరం లేదు. 

‘‘జాతీయ రాజకీయాలు మాత్రమే చేయాలని 30 సంవత్సరాల క్రితం నేను నిర్ణయించుకున్నాను. రాష్ట్ర బాధ్యత అంతా అజిత్ పవార్‌కు అప్పగించాను. దాదాపు గత 25 నుంచి 30 ఏళ్లుగా రాష్ట్ర బాధ్యతలు అజిత్ పవార్ వద్దే ఉన్నాయి. ఇక వచ్చే 30 ఏళ్ల కోసం ఏర్పాట్లు చేయాలి’’ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అజిత్ పవార్‌పై మేనల్లుడు యుగేంద్ర పవార్‌ పోటీ చేస్తున్నారు. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గంలో వీరిద్దరూ తలపడుతుండడం ఆసక్తికరంగా మారింది. కాగా పవార్ రాజ్యసభ పదవీకాలం 2026 సంవత్సరంలో పూర్తవుతుంది.


More Telugu News