నేను బీహార్ రావడం ఇదే ఫస్ట్ టైమ్... ఇంత ప్రేమా?: అల్లు అర్జున్

  • బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
  • పోటెత్తిన అభిమాన జనం
  • బీహార్ అందిస్తున్న ప్రేమను తట్టుకోలేకపోతున్నానన్న అల్లు అర్జున్
నేను బీహార్ రావడం ఇదే ఫస్ట్ టైమ్... ఇంత ప్రేమా?: అల్లు అర్జున్
బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అభిమానులను చూసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. టాలీవుడ్ హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాద్ లో ఈవెంట్ జరిపితే ఎలా ఉంటుందో, అంతకు రెట్టింపు స్పందన ఇవాళ పాట్నాలో కనిపించింది. దాంతో అల్లు అర్జున్ నిజంగా థ్రిల్లయిపోయారు. తన స్పీచ్ లో ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 

"బీహార్ అందిస్తున్న ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఇదే తొలిసారిగా బీహార్ రావడం. పుష్ప ఎవరి దగ్గర తగ్గడు, కానీ మొదటిసారి మీ ప్రేమానురాగాలు ముందు తగ్గుతున్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఇప్పుడు వైల్డ్ ఫైర్. నా అభిమానులు ఈ ఈవెంట్లో ఏమైనా చిన్నపాటి తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి. పుష్ప-1కు మీ ప్రేమను అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 

గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోనే ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్న సినిమాగా పుష్ప 2 ఉండటం, ఆ చిత్రంలో నేను ఒక భాగం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 

ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా గారికి, బీహార్ పోలీసులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. పుష్ప 2 ట్రైలర్ కార్యక్రమం పాట్నాలో జరగడం నాకు ఎంతో గర్వకారణంగానూ, ఆనందంగా ఉంది ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన మీ ముందుకు రాబోతుంది" అంటూ బన్నీ పేర్కొన్నారు.

ఊహించిన దాని కంటే మించి ఉంటుంది: రష్మిక మందన్న

అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను పుష్ప శ్రీవల్లి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలను. 

ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను.


More Telugu News