సచిన్ రికార్డుకు చేరువ‌లో జైస్వాల్‌.. మ‌రో 283 ర‌న్స్ చేస్తే ఆల్‌టైమ్ ఇండియా రికార్డు బ్రేక్‌!

  • ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ సంచ‌ల‌నం
  • ప్ర‌స్తుత క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో టెస్టుల్లో జైస్వాల్ ఇప్ప‌టికే 1,280  ప‌రుగులు
  • మ‌రో 283 ర‌న్స్ చేస్తే భార‌త్ త‌ర‌ఫున ఒక‌ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక స్కోర్ చేసిన ఆట‌గాడిగా రికార్డు
  • 2010లో 14 మ్యాచుల్లో 1,562 ప‌రుగులు చేసిన స‌చిన్
టీమిండియా యువ సంచ‌ల‌నం య‌శ‌స్వి జైస్వాల్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ఈ ఏడాది ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇక బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో ఈ యంగ్ ప్లేయ‌ర్ భారీ సెంచ‌రీ (161) బాదిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌట్ అయిన అత‌డు.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి శ‌త‌కం న‌మోదు చేశాడు. దాంతో భార‌త్‌... ఆతిథ్య జ‌ట్టును ఏకంగా 295 ప‌రుగుల తేడాతో మ‌ట్టిక‌రిపించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ కార‌ణంగా ఆసీస్ మీడియా మ‌నోడిని పొగ‌డ్త‌ల‌తో ముంచేసింది. జైస్వాల్‌ను విరాట్ కోహ్లీతో పోల్చిన అక్క‌డి మీడియా అత‌డిని న్యూ కింగ్‌గా పేర్కొన్నాయి.

ఇక ఈ ఏడాది దుమ్మురేపుతున్న జైస్వాల్ స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో ఏకంగా 700కి పైగా ప‌రుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ సిరీసుల్లోనూ ప‌ర్వాలేద‌నిపించాడు. ఇలా ప్ర‌స్తుత క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో టెస్టుల్లో జైస్వాల్ ఇప్ప‌టికే 1,280 ర‌న్స్ చేశాడు. మ‌రో 283 ప‌రుగులు సాధిస్తే భార‌త్ త‌ర‌ఫున ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక స్కోర్ చేసిన ఆట‌గాడిగా నిలుస్తాడు. ఇప్ప‌టివ‌రకు ఈ రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. 2010లో స‌చిన్ 14 మ్యాచుల్లో 1,562 ర‌న్స్ చేశారు. ఇండియా త‌ర‌ఫున ఇప్ప‌టివ‌రకు ఈ ప‌రుగులే అత్య‌ధికం.  

ఓవ‌రాల్‌గా పాకిస్థాన్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ టాప్‌లో ఉన్నాడు. 2006లో 11 టెస్టుల్లో యూస‌ఫ్ 1,788 ప‌రుగులు చేశాడు. ఈ నెల‌లో మ‌రో మూడు టెస్టులు ఆడే అవ‌కాశం ఉన్నందున జైస్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్సుంది. కాగా, బీజీటీలో భాగంగా అడిలైడ్ ఓవ‌ల్ వేదిక‌గా ఈ నెల 6 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.  


More Telugu News