బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురువు అరెస్ట్ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలి: బీజేపీ ఎంపీ

  • బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సందేశం పంపేందుకు తీర్మానం చేయాలన్న బీజేపీ ఎంపీ
  • ఇస్కాన్ గురువు తరఫున వాదించేందుకు ముందుకు వస్తే దాడులు చేస్తున్నారని ఆవేదన
  • ఇస్కాన్ గురువు తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న ఎంపీ
బంగ్లాదేశ్‌లో అరెస్టైన ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్ అరెస్ట్ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని బీజేపీ నేత, ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో జీరో అవర్‌లో ఆయన చిన్నయి కృష్ణదాస్ అంశాన్ని లేవనెత్తారు. ఇస్కాన్ గురువు అరెస్ట్ విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సందేశం పంపేందుకు పార్లమెంట్‌లో తీర్మానం చేసి ఆమోదించాలని ప్రధానిని కోరారు.

పోలీసుల అదుపులో ఉన్న చిన్మయి కృష్ణదాస్ కేసులో వాదించేందుకు ముందుకొచ్చిన న్యాయవాదులపై నిరసనకారులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దాడిలో గాయపడిన ఓ లాయర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. దీంతో ఇస్కాన్ గురువు తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొందన్నారు.

బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఆ దేశం నుంచి లక్షలాదిమంది మన దేశంలోని అసోంలోకి జొరబడ్డారని, ప్రస్తుతం వారు రాజకీయ, ఎన్నికల వ్యవస్థలో కీలకంగా మారారన్నారు.

హింస, అన్యాయం, మతాన్ని అవమానించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని మధుర బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. హిందువులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇస్కాన్ గురువు అరెస్ట్ దౌత్య సంబంధమైనది కాదని, ప్రజల భావోద్వేగాలు, భగవంతుడి పట్ల ఉన్న భక్తితో ముడిపడి ఉన్న అంశమన్నారు. ఇస్కాన్ ప్రచారకర్త త్వరలో విడుదలవుతారని ఆశిస్తున్నామన్నారు.


More Telugu News