బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

  • బంజారాహిల్స్‌ సీఐ ఫిర్యాదు మేర‌కు కౌశిక్ రెడ్డి అరెస్ట్‌
  • కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కౌశిక్‌ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్‌
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులకు భంగం క‌లిగించార‌ని బంజారాహిల్స్‌ సీఐ ఫిర్యాదు మేర‌కు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్‌ రెడ్డిని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 

ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రాకేశ్‌ రెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయ‌న‌ను కూడా గచ్చిబౌలి పీఎస్‌ తరలిస్తున్నారు. కాగా, బుధ‌వారం త‌న ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివ‌ధ‌ర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. అయితే, ఆయ‌న వెళ్లేస‌రికి ఏసీపీ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డంతో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు కావ‌డం జ‌రిగింది. ఇవాళ ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. 


More Telugu News