విక్రాంత్ రెడ్డి చిన్నవాడు... కేవీ రావు లాంటి బ్రోకర్ ను బెదిరించాడంటే నమ్ముతారా?: విజయసాయిరెడ్డి

  • కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలు
  • లుకౌట్ నోటీసులు జారీ 
  • కేవీ రావు ఓ బ్రోకర్... చంద్రబాబుకు చెంచా అంటూ విజయసాయి ఫైర్
కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడుతున్నారు. ఈ సాయంత్రం ఆయన మీడియా ముందుకువచ్చారు. 

వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ స్కాంలో జైల్లో ఉండి వచ్చిన శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి కేవీ రావుపై బెదిరింపులకు దిగారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించడం తెలిసిందే. కేవీరావు గొంతుమీద కత్తిపెట్టి రూ. 2వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను రూ.12 కోట్లకు, కాకినాడ సీ పోర్టులో రూ. 2,689 కోట్ల విలువైన షేర్లను రూ. 494 కోట్లకే కొట్టేశారని వివరించారు. దీనిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"కేవీ రావును విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డిది చిన్న వయసు... కేవీ రావు భారీ మనిషి! విక్రాంత్ రెడ్డి లాంటి వాడు కేవీ రావును బెదిరించడమేంటి... నాకర్థం కావడంలేదు. మరి విక్రాంత్ రెడ్డి భయపెడితే కేవీ రావు భయపడ్డాడా? 

ఆ కేవీ రావు సంవత్సరంలో ఆరేడు నెలలు అమెరికాలోనే ఉంటాడు. సింగపూర్ లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఇలాంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడంటే నమ్మొచ్చా? 

పైగా, రెండు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు నాకు నామినీలు అని ఆరోపిస్తున్నారు. నేను 2020 మేలో ఈ బ్రోకర్ కేవీ రావుకు ఫోన్ చేసి... విక్రాంత్ రెడ్డి వస్తాడు... కాకినాడ సీ పోర్ట్ గురించి మాట్లాడతాడు అని చెప్పానంట. చంద్రబాబుకు బుద్ధి మందగించిందా? అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు నామినీలు ఉండరు. నామినీలు ఉండేది బ్యాంకు అకౌంట్లకేనన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోతే ఇంకెలా అర్థం చేసుకోవాలి? 

వాస్తవాలు ఏంటంటే... కాకినాడ పోర్టును నాడు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పోర్టును చంద్రబాబు ప్రైవేటు రంగానికి అప్పగించేశారు. అప్పటి మలేసియా ప్రధాని కుమారుడు ఈ పోర్టును కొంటున్నారని ప్రచారం చేశారు. కానీ ఆ ముసుగులో కాకినాడ సీ పోర్టును కేవీ రావుకు అప్పగించారు. కేవీ రావును సీఎండీగా చేశారు. 

కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో తెలియాలంటే 1997 నుంచి జరిగిన పరిణామాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. చంద్రబాబు అందరినీ క్రిమినల్స్ అంటుంటాడు... చంద్రబాబే ఒక క్రిమినల్. అలాంటి చంద్రబాబుకు ఈ బ్రోకర్ కేవీ రావు ఒక చెంచా. కేవీ రావుకు నిజంగానే అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? 

ఇప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు... నా మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నందున చంద్రబాబు, కేవీ రావుపై పరువునష్టం దావా వేయాలనుకుంటున్నాను" అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.


More Telugu News