తండ్రితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ

  • కొన్ని నెలల కిందట తెలంగాణలో వరదలు
  • రూ.15 లక్షల విరాళం ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ
  • నేడు సీఎంను కలిసి చెక్ అందించిన వైనం
  • సిద్ధును అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి 
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి యూత్ ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సిద్ధు జొన్నలగడ్డ. కొన్ని నెలల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదల పట్ల స్పందించిన సిద్ధు... విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఇవాళ తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ సీఎం కార్యాలయానికి వచ్చాడు. 

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తాము ప్రకటించిన రూ.15 లక్షల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందించాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డను అభినందించారు. సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. 

సిద్ధు జొన్నలగడ్డతో పాటు సీఎంను కలిసిన వారిలో డాక్టర్ సి.రోహిణ్ రెడ్డి, మహేంద్ర, నిర్మాత కాశి కొండ కూడా ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. సిద్ధు జొన్నలగడ్డను, ఆయన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డను శాలువా కప్పి సత్కరించారు.


More Telugu News