బ్యాంకులో కాలర్ పట్టుకొని కొట్టుకున్న మేనేజర్, కస్టమర్.. వీడియో ఇదిగొ

  • ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడంపై తీవ్ర అసంతృప్తి
  • మేనేజర్‌తో ఘర్షణకు దిగిన కస్టమర్
  • అందరూ చూస్తుండగానే కొట్టుకున్న వైనం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడం ఓ బ్యాంక్ వినియోగదారుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సదురు కస్టమర్ నేరుగా బ్యాంక్‌కు వెళ్లి మేనేజర్‌తో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా చొక్కా కాలర్ పట్టుకొని కొట్టాడు. ఈ ఆసక్తికరమైన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. యూనియన్ బ్యాంక్‌లో జైమ్ రావల్ అనే కస్టమర్, బ్యాంక్ మేనేజర్ మధ్య బ్యాంకులో తీవ్ర ఘర్షణ జరిగింది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరగడం కస్టమర్‌ను నిరాశకు గురిచేసిందని, ఘర్షణకు దిగడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కాలర్‌ పట్టుకుని కొట్టుకోవడం వీడియోలో కనిపించింది. మేనేజర్‌ని తలపై కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. 

కస్టమర్‌తో పాటు ఉన్న ఒక మహిళ వీరిద్దర్ని విడదీసేందుకు ప్రయత్నించారు. ఇద్దరిలో ఒకరి చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కస్టమర్‌ను ఒక చెంపదెబ్బ కూడా కొట్టి గొడవ ఆపాలని కోరారు. చివరకు ఇద్దరూ గొడవ ఆపి దూరంగా జరిగారు. అయితే సదరు కస్టమర్ రెండోసారి దాడికి తెగబడ్డాడు. ఈసారి మరో బ్యాంక్ ఉద్యోగితో గొడవకు దిగడం గమనార్హం. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై వస్త్రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News