య‌శ‌స్వి జైస్వాల్‌ ను వదిలేసి వెళ్లిపోయిన టీమిండియా బస్సు.. కార‌ణ‌మిదే!

  • బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా
  • ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదిక‌గా మూడో టెస్టు
  • అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లే ముందు షాకింగ్ ఘ‌ట‌న‌
  • య‌శ‌స్వి జైస్వాల్‌ను హోటల్‌లోనే వ‌దిలేసి వెళ్లిపోయిన భార‌త జ‌ట్టు
  • యువ ఆట‌గాడు 20 నిమిషాలు ఆల‌స్యం కావ‌డంతో సార‌థి రోహిత్ షాకింగ్ నిర్ణ‌యం
ప్ర‌స్తుతం టీమిండియా బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే రెండు టెస్టులు ముగిశాయి. మూడో టెస్టు ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. దీనికోసం భార‌త ఆట‌గాళ్లు అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లారు. అయితే, అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేముందు ఒక షాకింగ్‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

స్పోర్ట్స్ టాక్ ప్రకారం.. భారత క్రికెట్ జట్టు బ్రిస్బేన్‌కు బయలుదేరడానికి జట్టు సిద్ధంగా ఉండగా, య‌శ‌స్వి జైస్వాల్ జట్టు హోటల్ లాబీకి సమయానికి చేరుకోవడంలో విఫలమయ్యాడు. ఫలితంగా అతను లేకుండానే బస్సు విమానాశ్ర‌యానికి వెళ్లిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్‌ సహా జట్టు మొత్తం అతని కోసం బస్సులో హోట‌ల్ బ‌య‌ట కాసేపు వేచి చూసింది. కానీ కొంత సమయం తర్వాత అక్క‌డి నుంచి బయలుదేరింది. యువ భారత బ్యాటర్ సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా లాబీకి వచ్చాడు. దాంతో విమానాశ్రయానికి ప్రత్యేక కారులో వెళ్లాల్సి వ‌చ్చింది.

భారత క్రికెట్ జట్టు ఉదయం 10 గంటలకు విమానంలో బ్రిస్బేన్‌కు వెళ్లాల్సి ఉంది. దాంతో జట్టు ఉదయం 8:30 గంటలకు హోటల్ నుండి బయలుదేరడానికి సిద్ధమైంది. కానీ జైస్వాల్ సమయానికి రాలేక‌పోయాడు. యువ ఆట‌గాడు ఆలస్యం కావ‌డంప‌ట్ల కెప్టెన్ రోహిత్ నిరుత్సాహానికి గురయ్యాడ‌ని స్పోర్ట్స్ టాక్ వెల్ల‌డించింది. దాంతో జైస్వాల్‌ను హోట‌ల్‌లోనే వదిలేసి టీమిండియా వెళ్లిపోయింది.

దాదాపు 20 నిమిషాల తర్వాత జైస్వాల్‌ హోటల్ లాబీకి వచ్చాడు. కానీ, అప్ప‌టికే బస్సు విమానాశ్రయానికి బయలుదేరింది. టీమ్ మేనేజ్‌మెంట్ అతని కోసం కారును ఏర్పాటు చేసింది. ఓ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో కలిసి ఆ వాహనంలో ప్ర‌యాణించిన‌ జైస్వాల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని జ‌ట్టుతో క‌లిశాడు.

ఇక అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్‌పై ఆతిథ్య‌ ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు పెర్త్ లో జ‌రిగిన మొద‌టి టెస్టులో టీమిండియా 295 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఇప్పుడు ఇరు జ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్నాయి.  


More Telugu News