అల్లు అర్జున్‌పై మాకు ఎలాంటి కక్ష లేదు.. మహిళ చనిపోతే అరెస్ట్ చేయవద్దా?: టీపీసీసీ చీఫ్ ప్రశ్న

  • చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ఏ నటుడిపై కాంగ్రెస్ పార్టీకి కోపం లేదన్న టీపీసీసీ చీఫ్
  • బీజేపీ నేతలు తమకు ఆపాదిస్తున్నారన్న మహేశ్ కుమార్ గౌడ్
సినీ నటుడు అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని, అయినా ఆయన కారణంగా ఓ మహిళ చనిపోతే అరెస్ట్ చేయవద్దా? అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమన్నారు.

తొక్కిసలాట కారణంగా ఓ పేద మహిళ చనిపోతే చర్యలు తీసుకోవద్దా? అన్నారు. అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్ట ప్రకారమే అల్లు అర్జున్‌పై కేసు పెట్టారని, అరెస్ట్ చేశారని, ఆ తర్వాత కోర్టు బెయిల్ (మధ్యంతర) కూడా ఇచ్చిందన్నారు. ఏ నటుడిపై కూడా కాంగ్రెస్ పార్టీకి కోపం లేదన్నారు. తమకు సినిమా వారి పట్ల ప్రేమే ఉందన్నారు.

సినిమా తారలపై కేసులు అన్నీ చట్టం పరిధిలోనివే అన్నారు. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసును కాంగ్రెస్ పార్టీకి ఆపాదించవద్దని కోరారు. దీనిని అధికార పార్టీకి ఆపాదించే ప్రయత్నం తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.


More Telugu News