రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది: ప్రధాని మోదీ

  • రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శ
  • మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న ప్రధాని
  • ఈ దేశాన్ని ఒక కుటుంబం 55 ఏళ్లు పాలించిందన్న మోదీ
  • ఆ కుటుంబం రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించిందని విమర్శ
మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్ సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ఎన్నో విధాలుగా ప్రయత్నించిందని విమర్శించారు. రాజ్యాంక శక్తి, ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నాయన్నారు. తమ పరిపాలనను చూసి ప్రజలు తమకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజ్యాంగ పరిరక్షణకు అండగా ఉంటామన్నారు. ఈ దేశాన్ని ఒక కుటుంబం 55 ఏళ్లు పాలించిందని, ఆ కుటుంబమే ఈ దేశానికి ఎన్నో విధాలుగా నష్టం చేసిందన్నారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖ రాశారని పేర్కొన్నారు. ఆయన తప్పు చేస్తున్నాడని బాబూ రాజేంద్ర ప్రసాద్ చెప్పారని వెల్లడించారు. 

కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మందిని జైళ్లకు పంపించారని, కోర్టుల నోరు, పత్రికల గొంతు నొక్కేశారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిని కూడా అడ్డుకున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకునేవారని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర

మన దేశ అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత దక్కాలన్నారు. మన రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని తెలిపారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలన్నారు. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్ప విధానమని ప్రధాని అన్నారు. కొంతమంది స్వార్థపరుల వల్ల స్వాతంత్ర్యం వచ్చాక మనం అనేక కష్టాలు పడ్డామన్నారు.

బానిసత్వంలో ఉన్నవాళ్లు మన దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆరోపించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారని విమర్శించారు. పేదలు ఉపాధిని వెతుక్కుంటూ వివిధ ప్రాంతాలకు వెళ్తారని అందుకే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చామన్నారు. మన రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించిందన్నారు. రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం ఏర్పడుతుందన్నారు.


More Telugu News